మనం చాలా వరకు హిజ్రాలను రోడ్లపైనో, షాపుల్లో డబ్బులు వసూల్ చేస్తూ కనిపిస్తుంటారు. ఇలానే కాకుండా ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు కూడా. అయితే.. మామూలుగా హిజ్రాలను చులకనగా చూసే వారు ఎక్కువ. అయితే ఇప్పుడు ఇద్దరు హిజ్రాలు ప్రజలచే ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ యువతిని అత్యాచారం నుంచి రక్షించారు. ఈ ఘటన బెంగళూరులోని కేఆర్ పురంలోని వివేకనగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, మిజోరాంకు చెందిన యువతి బెంగళూరులో నర్సింగ్ కోర్సు చదువుతోంది. ఒక గదిలో ఆమె ఒంటరిగా ఉంటోంది. అక్కడికి సమీపంలో హోటల్ లో పని చేస్తున్న పశ్చిమబెంగాల్ కు చెందిన మసురుల్ షేక్ ఆమెపై కన్నేశాడు. ప్రతి రోజు ఉదయం ఆ యువతి ఉంటున్న గది డోర్ బెల్ కొట్టి పారిపోయేవాడు.
బెల్ మోగంగానే ఆమె బయటకు వచ్చి చూసేది. ఎవరూ కనపడకపోయేసరికి మళ్లీ లోపలకు వెళ్లిపోయేది. తాజాగా ఎప్పటి మాదిరే అతను డోర్ బెల్ కొట్టగా, ఆమె వచ్చి తలపు తీసింది. వెంటనే గదిలోకి చొరబడిన మసురుల్ షేర్ ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో, ఆమె భయంతో కేకలు వేసింది. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఇద్దరు హిజ్రాలు అక్కడకు వచ్చి ఆమెను కాపాడారు. ఇంతలోనే అక్కడకు స్థానికులు కూడా వచ్చారు. అందరూ కలిసి అతన్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. యువతిని కాపాడిన హిజ్రాలను స్థానికులు, పోలీసులు ప్రశంసించారు.