స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల మెడలకు ఉరితాళ్లు బిగిస్తున్న జగన్ రెడ్డి, టెండర్లలో అధిక ధరకోట్ చేయించి, రూ.4,800కోట్లు కొట్టేయడానికి సిద్ధమయ్యాడన్నారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా మాట్లాడుతూ.. గృహాల్లో స్మార్ట్ మీటర్ల బిగించే కాంట్రాక్ట్ ని రూ.9 వేల కోట్లకు ఫైనల్ చేసిన ప్రభుత్వం, రూ.4వేలకోట్లు కొట్టేసేందుకు సిద్ధమైందని ఆయన అన్నారు. అంతేకాకుండా.. ‘మొత్తంగా రైతులు, గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.9వేలకోట్లు కొట్టేయడానికి జగన్ అండ్ కో సిద్ధమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్ మీటర్ ధరను రూ.10వేలు, అంతకంటే తక్కువగా నిర్ణయిస్తే జగన్ మాత్రం రూ.37వేలు పెట్టాడు.
బంధువు కంపెనీ షిరిడీ సాయిఎలక్ట్రికల్స్ కు దోచిపెట్టడానికి ప్రజల్ని రాబందుల్లా పీక్కు తింటున్నాడు. స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియ పారదర్శకంగా జరిగితే వివరాలు ఎందుకు బయట పెట్టరు? టెండర్లన్నీ నిబంధనల ప్రకారమే వేస్తే, ఎల్-1, ఎల్-2 ఎవరు? ఏసంస్థ ఎంత కోట్ చేసిందనే వివరాల్ని ఎందుకు దాస్తున్నారు..? మూడు రోజుల్లో ముఖ్యమంత్రి స్మార్ట్ మీటర్ల టెండర్ల వివరాలు ప్రజల ముందు ఉంచాలి. అది చేతగాకపోతే రూ. 9 వేల కోట్లను దోపిడీ చేస్తున్నట్టు అంగీకరించాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.