కడప : బద్వేల్ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. బిజేపి పార్టీ తరఫున బద్వేల్ లో ఎన్నికల ఏజెంట్లు గా టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పని చేస్తున్నారు. పలుచోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నేతలు ఉన్నారు. అయితే ఈ ఘటన పై వైసీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. బద్వేలులో ఎన్నికల ఏజెంట్లుగా టీడీపీ నాయకులు పని చేస్తున్నారని మండిపడ్డారు బద్వేలు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి, మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి. అనేక పోలింగ్ బూతుల్లో బీజేపీ పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారని ఆగ్రహించారు.
సిట్టింగ్ అభ్యర్థి మరణించినట్టైతే, వారి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న పక్షంలో పోటీ పెట్టం అన్న టీడీపీ ప్రకటన పచ్చి అబద్ధం అని స్పష్టం అవుతుందని చురకలు అంటించారు. సిట్టింగ్ దళిత శాసన సభ్యుడి పట్ల గౌరవం చూపుతున్నామన్న చంద్రబాబు ప్రకటన కూడా పచ్చి మోసమని… దళితుల పట్ల చంద్ర బాబు కపట ప్రేమ మరోసారి స్పష్టమైందన్నారు. బద్వేలులో బాహాటంగా టీడీపీ నాయకత్వం బరిలో దిగిందని…ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. ఈ ఉప ఎన్నికలో జగన్ గారి అభ్యర్థిదే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి.