రాష్ట్ర కేబినెట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం సమావేశమైన విషయం తెలిసిందే. అయితే.. దాదాపుగా 5 గంటల పాటు సాగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 58 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇవ్వాలని ఇటీవలే కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయానికి గురువారం నాటి కేబినెట్ భేటీ ఆమోద ముద్ర వేసింది. ఫలితంగా ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందనున్నాయి. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయనున్నట్లు కేసీఆర్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంపైనా చర్చించిన కేబినెట్… ఈ ఆగస్టు 15 నాడు రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీల్లో 75 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. కోఠిలోని ఇఎన్‌టీ ఆసుపత్రిని అధునాతన సౌకర్యాలతో తీర్చిదిద్దుతూ ఈఎన్‌టీ టవర్స్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అదే విధంగా సరోజినిదేవీ కంటి ఆసుపత్రిని కూడా ఆధునీకరిస్తూ కొత్త భవన సముదాయాన్ని నిర్మించేందుకు కేబినెట్ తీర్మానించింది.