హైదరాబాద్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై మంత్రులతో కేసీఆర్ చర్చించున్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించాలా? లేదా? అనే అంశంపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. కరోనా మరణాలు , కేసుల తీవ్రత , వ్యాక్సిన్ , రేమిడిసివర్ , ఆక్సిజన్ కొరతపై సీఎం చర్చించనున్నారు. కోవిడ్ అరికట్టడానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వివిధ అవసరాలపైనా మంత్రులు చర్చించనున్నారు. ఈటల బర్తరఫ్ తరువాత ఆరోగ్యశాఖ అదనపు బాధ్యతలపై సీఎం నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. అటు భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మొదటసారి లాక్‌డౌన్ పెట్టినప్పుడు చాలా నష్టపోయామని అంటున్నారు. కరోనా ఉధృతిని కట్టడి చేయాలంటే లాక్‌డౌన్ తప్పనిసరి అని మరికొందరు వాదిస్తున్నారు. మరి తెలంగాణ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే మధ్యాహ్నం వరకు ఆగాల్సిందే.