గల్లీ లో కుస్తీ ఢిల్లీ లో దోస్తీ ! కేసీఆర్ ఢిల్లీ రాజకీయం ?

-

ముందు వెనుక చూడకుండా చెడామడా తిట్టి నా.. మళ్లీ అదే నోటితో పొగిడినా, ఏదైనా తెలంగాణ సీఎం కేసీఆర్ కే సాధ్యం అవుతుంది. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి రాజకీయ శత్రువు గా మారిన బీజేపీకి ఛాన్స్ దక్కకుండా చేసేందుకు ఎన్నో రకాల వ్యూహాలను కెసిఆర్ ఒక పక్క అమలు చేస్తూనే , మరో పక్క ఢిల్లీలో బిజెపి అగ్ర నేతలను కలుస్తూ వస్తుండడం తో కెసిఆర్ రాజకీయం ఏమిటో ఎవరికి ఒక పట్టాన అర్థం కావడం లేదు. కెసిఆర్ అకస్మాత్తుగా ఢిల్లీ టూర్ ఎందుకు పెట్టుకున్నారు అనేది ఎవరికీ క్లారిటీ లేదు. మామూలుగా అయితే బిజేపి అగ్రనేతల అపాయింట్మెంట్లు దొరకడం చాలా కష్టం. ఇప్పటికే ఏపీలో బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సైతం బిజెపి అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అలాగే ఏపీ సీఎం జగన్ అనేక సందర్భాల్లో ఢిల్లీకి వెళ్లినా, చాలా సందర్భాల్లో ఆయన అపాయింట్మెంట్ దొరకకపోవడం తో వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి.

అయితే కేసీఆర్ విషయంలో మాత్రం అలా జరగక పోవడం, నేరుగా ఆయన ఢిల్లీకి వెళ్లి బిజెపి అగ్ర నేతలతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముందుగా షేకావత్, ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కేసీఆర్ అనేక అంశాలపై చర్చించారు. అయితే వీరి మధ్య చర్చకు వచ్చిన విషయాలు ఏమిటనేది బయటకు చెప్పకపోయినా, తెలంగాణలో నెలకొన్న వివిధ సమస్యలు, కేంద్ర సహాయం పైన కెసిఆర్ బిజెపి అగ్రనేతలు వద్ద ప్రస్తావించినట్లు టిఆర్ఎస్ చెబుతోంది. అదీ కాకుండా కేసీఆర్ వెంట పార్టీ నాయకులు ఎవరు లేరు. కొంతమంది అధికారులు వెళ్ళినా, వారు కొన్ని అంశాల వరకే పరిమితం అయిపోయారు.

సుమారు గంట సేపు బీజేపీ అగ్రనేతలతో కేసీఆర్ ఏ అంశాలపై చర్చించారు అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కెసిఆర్ ఢిల్లీ టూర్ పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు మొదలుపెట్టారు. గల్లీలో బిజెపితో లొల్లి పెట్టుకుని ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కలుస్తూ వారితో స్నేహం కోసం పోరాటం చేయడం కెసిఆర్ కు మాత్రమే చెల్లింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి టీఆర్ఎస్ మధ్య ఏ స్థాయిలో విమర్శలు జరిగాయో వాటన్నిటిని పక్కనపట్టి మరీ కెసిఆర్ బిజెపి అగ్రనేతల ప్రసన్నం కోసం ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news