దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఆన్‌లైన్ పద్ధతిలో అందిస్తున్న 1,400 సేవలపై నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులను ఖరారు చేసింది. నేషనల్ ఈ-గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్‌మెంట్ (ఎన్‌ఈఎస్‌డీఏ)-2021 ప్రకటించిన ర్యాంకుల్లో తెలంగాణ 5, ఏపీ 8వ స్థానంలో నిలిచాయి. రాష్ట్రాలను హిమాలయ-ఈశాన్య, కేంద్రపాలిత ప్రాంతాలు, గ్రూప్-ఎ, గ్రూప్-బిలుగా విభజించి ఆయా కేటగిరీల్లో ర్యాంకులను ప్రకటించింది. గ్రూప్-ఎ కేటగిరీలోని మొత్తం 10 రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్‌లు తొలి మూడుస్థానాలను దక్కించుకోగా తెలంగాణ 5, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచాయి. ఆర్థిక వ్యవహారాలు, స్థానిక సంస్థలు, విద్యుత్తు, తాగునీరు, ఇతర గృహావసర సేవలను ఈ-గవర్నెన్స్ ద్వారా వినియోగదారులు అత్యధిక సంఖ్యలో ఉపయోగించుకుంటున్నట్లు కేంద్రం చెప్పింది.
ప్రజలు ఒకే సేవ అందించే పోర్టల్‌కు పరిమితం కాకుండా అన్నిసేవలూ ఒకేచోట అందించే ఇంటిగ్రేటెడ్, సెంట్రలైజ్డ్ పోర్టల్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం 2019లో ఎన్‌ఈఎస్‌డీఏ విధానాన్ని ప్రవేశపెట్టింది. రెండేళ్లకోసారి ర్యాంకులు ఇస్తోంది.దేశవ్యాప్తంగా అందుతున్న డిజిటల్ సేవలను అంచనావేయడానికి కేంద్ర ప్రభుత్వం 2021 జూన్‌లో ఒక పోర్టల్‌ను ప్రారంభించి 2022 మే వరకు డేటాను సేకరించి విశ్లేషించింది. అందుబాటు, విషయలభ్యత, సులభ వినియోగం, సమాచార భద్రత, గోప్యతల ఆధారంగా ర్యాంకులు ప్రకటించింది. దీన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణశాఖ మంత్రి జితేంద్రసింగ్ నేడు అధికారికంగా విడుదల చేయనున్నారు.