ఒకప్పుడు ప్రతిపక్షాల మీద ఒంటి కాలిపై లేచిన మంత్రిగారు సడన్ గా సైలెంట్ అయ్యారా..బీజేపీ అన్న బండి సంజయ్ అన్న దూకుడు పెంచి తనదైన శైలిలో విమర్శలు గుప్పించే మంత్రి గంగుల కమలాకర్ మౌనం పై ఇప్పుడు సొంత పార్టీలోనే ఆసక్తికర చర్చ నడుస్తుంది. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో బీజేపీ నేతలు విమర్షలు చేస్తున్నా ఉలుకుపలుకు లేకుండా ఉన్న మంత్రిగారి మౌనంపై జిల్లాలో పలు రకాలుగా చర్చ నడుస్తుంది..
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న కొద్ది మంది దూకుడు స్వభావం గల మంత్రుల్లో గంగుల కమలాకర్ ఒకరు..ఎప్పుడైనా ప్రత్యర్ధుల పట్ల తనదైన శైలిలో విమర్శలు గుప్పించడంలోనూ దిట్ట. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు..గతంలో టీడీపీలో ఉన్న రోజుల్లోనూ ఆయన అనుకున్నది చేయగలిగారు..ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ లో చేరారు…టీఆర్ఎస్ లో కూడా అదే స్పీడ్ కొనసాగిస్తూ వచ్చారు..ఇక మంత్రి అయిన తర్వాత ఆయన తన నోటికి మరింత పని చెప్పారు. తన రాజకీయ ప్రత్యర్థి అయిన ఎంపీ బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఒక సమయంలో మంత్రి వర్గాన్ని మాఫియాతో పోల్చిన బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేస్తానని, కోర్టు మెట్లు ఎక్కిస్తానని కూడా శపథం చేశారు..ఇదొక్కటే కాదు సీఎం కేసీఆర్ ను గానీ, మంత్రి కేటీఆర్ ను గానీ ఎవ్వరు విమర్శించినా వారికి గట్టిగా కౌంటర్ అటాక్ చేసేవారు మంత్రి గంగుల కమలాకర్..తన స్థాయి కాని వ్యక్తులపై కూడా ఆయన తన నోటికి పని చెప్పేవారు. అయితే ఇదంతా గంగుల కమలాకర్ గతం…గతానికి భిన్నంగా గడిచిన ఆర్నెళ్లుగా గంగుల కమలాకర్ చాలా సైలెంటై పోయారు…ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంత నిశ్శబ్దం ఇప్పుడే కనిపిస్తోంది…తన అనుచర వర్గం హడావిడి కూడా బాగా తగ్గిపోయింది.
అసలు గంగుల కమలాకర్ మౌనానికి కారణం ఏంటీ? జిల్లాలోని తన సహచర మంత్రులంతా బిజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే గంగుల కమలాకర్ మాత్రం ఎందుకు నోరెత్తడం లేదనే చర్చ సాగుతోంది… ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటెల రాజేందర్ ఇటీవల బిజేపీని జిల్లాలో టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు…ఇక బండి సంజయ్ పై ఎంపీగా ఓడిపోయిన వినోద్ కుమార్ కూడా సంజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా ఘాటుగా విమర్శలు చేశారు…కరీంనగర్ జిల్లాకు ఏ మాత్రం సంబంధం లేని బాల్క సుమన్ స్వయంగా మంత్రి కార్యాలయంలో మంత్రిని పక్కనే కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మరీ బిజేపీని, బండి సంజయ్ ను తీవ్ర స్థాయిలో విమర్శించారు.
బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా గంగుల కమలాకర్ ఏమీ మాట్లాడలేదు…ఇలా రోజు రోజుకూ ప్రత్యర్థి పార్టీపై ఒంటి కాలితో లేచి విమర్శలు చేసే గంగుల కమలాకర్ ఎందుకు మౌనంగా ఉన్నాడనే చర్చ జిల్లాలో హాట్ టాపిక్ అయింది..అయితే తాను బీజేపీపై బండి సంజయ్ పై విమర్శలు చేయవద్దని అధిష్టానం నుండి చెప్పారని అందుకే విమర్శలు చేయడం లేదని సన్నిహితులు దగ్గర అన్నారట గంగుల..అయితే ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని తిడుతుంటే గంగుల కమలాకర్ కు మాత్రమే తిట్టొద్దని అధిష్టానం చెబుతుందా అని లోకల్ లీడర్స్ చర్చించుకుంటున్నారట..