ఆత్మీయ సమ్మేళనాలు సరే..షర్మిల ముందున్న అసలు సవాళ్లు ఇవే

Join Our Community
follow manalokam on social media

ఆత్మీయ సమ్మేళనాలతో తెలంగాణలో షర్మిల అలజడి రేపారు. ఇంకా పార్టీ కూడా పెట్టకముందే అన్ని పార్టీల నేతలు స్పందించేలా చేశారు. అటు ఏపీలో కూడా షర్మిల తెలంగాణలో ఎంతవరకు విజయవంతమౌతారనే చర్చ జోరుగానే జరుగుతోంది. తెలంగాణలో ఎప్పుడూ సెంటిమెంట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాకలు తీరిన నేతలే తెలంగాణలో పార్టీలు పెట్టి చేతులెత్తేశారు. కొత్త పార్టీ పేరుతో తెలంగాణ ప్రజలముందుకొస్తున్న వైఎస్ తనయ షర్మిలకు పలు సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి..వీటిని షర్మిల ఎలా ఎదుర్కొంటారన్నదే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుంది.

వైఎస్ కుటుంబానికి తెలంగాణలో అభిమానులున్నా సమైక్యవాదులుగా గుర్తింపు ఉంది. సమైక్యవాదాన్ని బలంగా వినిపించేవాళ్లు. గతంలో జగన్ పాదయాత్ర సమయంలో కూడా టీఆర్ఎస్ మానుకోటలో రణరంగం సృష్టించింది. అలాంటి సమైక్యవాది కుటుంబానికి చెందిన షర్మిల.. తెలంగాణ సెంటిమెంట్ ను ఎలా ఎదుర్కుంటారనేది కీలకమైన ప్రశ్న. అసలు తెలంగాణతో నీకేంటి సంబంధం అని అడిగితే షర్మిల ఏం చెబుతారనేది కూడా ప్రస్తుతానికి సమాధానం లేని సవాలే. షర్మిలను తెలంగాణ కోడలిగా ప్రచారం చేయాలని ఆమె సన్నిహితులు భావిస్తున్నా.. ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది చూడాలి.

తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని పట్టుకోవడంలో కేసీఆర్ ఇప్పటికే తలపండి పోయారు. కాంగ్రెస్ ఆ విషయంలో విఫలమయ్యే రెండుసార్లు అధికారానికి దూరమైంది. మరి తెలంగాణ సెంటిమెంట్ ను తట్టుకుని షర్మిల ఎలా రాజకీయం చేస్తారనే విషయం.. ఆమె పార్టీ భవిష్యత్తును తేల్చనుంది. తెలంగాణలో వైఎస్ అభిమానులున్నారని షర్మిల లెక్కేసుకుంటున్నారు. ఆ విషయం నిజమే అయినా.. షర్మిల ఆశిస్తున్న స్థాయిలో వైఎస్ కు తెలంగాణలో అభిమానులున్నారా అనేదే అసలు ప్రశ్న. తెలంగాణలో వైఎస్ కు ఇప్పుడున్న అభిమానుల బలం ఎంత, ఎన్నికల్లో వారి చూపే ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంలో ఇప్పటికైతే స్పష్టత లేదు. ఈ విషయంలో షర్మిల వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నారనే వాదన కూడా ఉంది.

తెలంగాణ రెడ్డి సామాజికవర్గంపై షర్మిల చాలా ఆశలు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తోంది. షర్మిల ఆశించిన స్థాయిలో రెడ్లు ఆమె వైపు మొగ్గుచూపుతారా అనేది కూడా చెప్పడం కష్టమే. షర్మిలను తెలంగాణ రెడ్లు ఎలా చూస్తున్నారనేది కూడా ఇక్కడ కీలకమే. షర్మిలను కేవలం ఓట్లు చీల్చే నేతగా చూస్తారా… లేకపోతే రాజన్న రాజ్యం తేగలిగే సత్తా ఉన్న నేతగా పరిగణిస్తారా అనే అంశమే.. రెడ్ల మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనే విషయం చెప్పనుంది. వైఎస్ వారసత్వం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి షర్మిలకు గట్టిపోటీ ఎదురవ్వడం ఖాయం. ఇప్పటికే ఆ పార్టీ నేతలు వైఎస్ కు పార్టీ పరంగా వారసులం తామే అంటున్నారు. మరి కాంగ్రెస్, షర్మిల పార్టీ రెండూ వైఎస్ ఫోటో పెట్టుకుని జనం దగ్గరకు వెళ్లి ఓట్లు అడిగితే ఏం జరుగుతుందనేది సైతం ఆసక్తి రేపుతుంది.

రాజకీయ పార్టీ పెట్టడం కేసీఆర్ చెప్పినట్టుగా ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో పార్టీని నడపాలంటే నేతలు, క్యాడర్ తో పాటు నిధులు కూడా చాలా అవసరం. షర్మిల వైపు ఎంత మంది నేతలొస్తారు.. క్యాడర్ ఏ స్థాయిలో ఉంటుందనే విషయం పక్కనపెడితే.. నిధులు ఎక్కడ్నుంచి వస్తాయనేది కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీని నడిపే స్థాయిలో షర్మిల దగ్గర నిధులున్నాయా.. లేకపోతే నిధుల సమీకరణ ఎలా చేస్తారు.. ఎక్కడ్నుంచి నిధులు తీసుకొస్తారనేది కీలకంగా మారింది. రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండటంతో.. కాంగ్రెస్ లాంటి జాతీయ స్థాయి పార్టీకి వచ్చే విరాళాలే దారుణంగా పడిపోయాయి. అలాంటిది ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో షర్మిల రాణిస్తుందని నమ్మి.. విరాళిలిచ్చేదెవరనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి.

గతంలో తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేసిన పరిస్థితులకు.. ఇప్పటి పరిస్థితులకు చాలా తేడా ఉంది. అప్పటి ప్రజా స్పందన ఇప్పుడు కూడా వస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న ప్రధాన పార్టీలకు తాను ఎలా ప్రత్యామ్నాయం అవుతాననేది షర్మిల ప్రజలకు స్పష్టంగా చెప్పగలగాలి. తాను తెస్తానంటున్న రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో.. అది ఇప్పుడు ఎందుకు రాదో కూడా కన్విన్స్ చేయగలగాలి. ఇవన్నీ జరిగినప్పుడే షర్మిల పార్టీ తెలంగాణలో బలపడే అవకాశం ఉంటుంది.

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....