వాతావరణ శాఖ చల్లిన కబురు చెప్పింది. గత కొన్నాళ్ల నుంచి ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రైతులకు ఆనందాన్ని కలిగించే వార్తను చెప్పింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నైరుతి రుతపవనాల ఆగమనానికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని తూర్పు, మధ్య, దక్షిణ భాగాలకు విస్తరించాయని.. మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతంలో, అరేబియా సముద్రంలోని దక్షిణ, ఆగ్నేయ భాగాల్లో నైరుతి రుతుపవనాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధిపతి నాగరత్న వెల్లడించారు. రానున్న 48 గంటల్లో ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఉత్తర అంతర్భాగమైన కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి అవరించి ఉందని వెల్లడించారు. తెలంగాణలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఏడాది అనుకున్న సమయాని కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు పలకరించనున్నాయి.