భూముల‌నే కాపాడ‌లేనోళ్ళు రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారు?

ప్రభుత్వ భూములను ప్రజల అవసరాల కోసమే వినియోగించాలని తెలంగాణ సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ భూముల అమ్మకాన్ని వ్య‌తిరేకిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు భ‌ట్టి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసారు. సీఎం కేసీఆర్ చేసిన ఆర్థిక పాపాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు వేల‌కోట్ల రూపాయ‌ల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను అమ్మ‌కానికి పెట్టాడని భట్టి ఆరోపించారు.

జిల్లాకు వెయ్యి ఎక‌రాల చొప్పున దాదాపు 33 వేల ఎక‌రాల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను అమ్మ‌డానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని భట్టి ఆరోపించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వాలు… ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడుకుంటూ వచ్చాయని, ప్ర‌భుత్వ భూముల‌ను ప్ర‌జా అవ‌స‌రాల కోస‌మే వినియోగించాయని అన్నారు. రూ. 15వేల కోట్ల మిగుల బ‌డ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణకు రూ.4 ల‌క్ష‌ల కోట్ల అప్పు తీసుకొచ్చిన కేసీఆర్… ఆ డబ్బును కాళేశ్వ‌రం, మిష‌న్ భ‌గీర‌థ‌ పేరుతో కాజేసి.. ఇప్పుడు ప్రభుత్వ భూముల‌ మీద ప‌డ్డారని ఆరోపించారు.

ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడుకోలేక వాటిని అమ్ముతున్నామ‌ని, అవి నిర‌ర్ధ‌క ఆస్తుల‌ని సిగ్గు లేకుండా కేసీఆర్ మాట్లాడ‌తున్నారని భట్టి ధ్వజమెత్తారు. భూముల‌ను కాపాడ‌లేని వ్య‌క్తులు తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆసుపత్రులకు, వివిధ ప్రజావసరాలకు భూములు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. అరకొరగా ఉన్న ప్రభుత్వ భూములను అమ్మేస్తే రాష్ట్రం ఏమవ్వాలని భట్టి ప్రశ్నించారు.