రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులో జలవిహార్ వద్ద డ్రగ్స్ నిర్మూలన ర్యాలీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వినియోగం విష ప్రయోగం లాంటిదని.. ఇది అత్యంత ప్రమాదకరమని భట్టి అన్నారు. కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందని.. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సంఘ విద్రోహశక్తుల చేతిలో యువత జీవితాలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
“తెలిసీ తెలియని వయసులో వాటి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు కావాలనే తమ అక్రమ సంపాదన కోసం యువతకు డ్రగ్స్ అంటగడుతున్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగానూ దీన్ని చూడొచ్చు. రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉంది. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంత బడ్జెట్ అయినా కేటాయిస్తాం. వాటి వినియోగం, రవాణా లేకుండా చేయాల్సిన బాధ్యత ఆ అధికారులదే. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ప్రజల నుంచి కూడా సహకారం అందాలి.” అని భట్టి విక్రమార్క అన్నారు.