బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ మరో ముందడుగు…. ప్రతిపక్ష నేతల సమావేశానికి ముహూర్తం ఖరారు

-

బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తూ సమన్వయం చేస్తున్న బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మరో ముందడుగు వేశారు. కాంగ్రెస్‌కి మద్ధతుగా ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తీసకురావడంలో తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో ముంబయిలో పర్యటించారు నితీష్‌.ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేలను కలిశారు.అలాగే కొల్‌కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, లక్నోలో అఖిలేష్ యాదవ్‌లను నితీష్ కుమార్ కలిశారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిపై వారితో చర్చించి సమన్వయం చేయడంలో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో ఐక్య విపక్ష కూటమి ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. పాట్నాలో నితీష్ నిర్వహించనున్న ప్రతిపక్ష పార్టీల ఐక్యతా సమావేశానికి ముహుర్తం ఖరారైంది. జూన్ 23న నీతీష్ కుమార్ నిర్వహించనున్న ఈ సమావేశానికి.. వీలైనన్ని ఎక్కువ పార్టీలను ప్రతిపక్ష కూటమిలోకి ప్రయత్నిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వంటి ప్రముఖులు రానున్నారని సమాచారం.

ముందుగా జూన్ 12న ఈ సమావేశాన్ని పాట్నాలో నిర్వహించాలని జేడీయు, ఆర్జేడీ నేతలు భావించారు. అయితే తమను సంప్రదించకుండానే తేదీని ఖరారు చేయడంపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తంచేయడంతో ఆ సమావేశాన్ని వాయిదావేశారు. జూన్ 23న నిర్వహించాలని నిర్ణయించినట్లు పాట్నాలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో తేజస్వి యాదవ్ వెల్లడించారు. ఈ సమావేశంలో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, వామపక్ష సీనియర్ నేతలు డీ రాజా, సీతారాం ఏచూరీ, దీపన్‌కర్ భట్టాచార్య తదితరులు కూడా పాల్గొంటారని తేజస్వి యాదవ్ స్పష్టం చేశారు.

సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. వరుసగా మూడోసారి అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని కమలనాథులు ధీమాగా ఉంటే బీజేపీని ఇంటికి సాగనంపే సత్తా ప్రతిపక్ష కూటమికి ఉందని ఇటీవల నితీష్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి అన్ని ప్రతిపక్ష పార్టీలతో ముమ్మరంగా సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర విపక్ష నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news