పార్టీ ఎవ్వరికీ టికెట్ ఇస్తే వారి విజయం కోసం నేతలందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలను కోరారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తలకొండపల్లి జడ్పీటీసీ వెంకటేష్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు నలుగురు ఐదుగురికి ఆసక్తి ఉండవచ్చు. ఇందులో తప్పు ఏం లేదన్నారు.
కానీ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కరే ఎమ్మెల్యే అవుతారని పేర్కొన్నారు. గతంలో ఇద్దరూ ఎమ్మెల్యేలుండేవారని.. ఆయన సెటైర్లు వేశారు. కల్వకుర్తిలో నలుగురికి నాలుగు ఆలోచనలు ఉండవచ్చు. కానీ ఉన్నది ఒక్కటే బీ ఫాం, ఒక్కటే ఎమ్మెల్యే సీటు అని చెప్పారు కేటీఆర్. అన్ని అంశాలను పరిశీలించి అభ్యర్థులను ప్రకటించిన తరువాత తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి పార్టీ ప్రకటించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు కేటీఆర్. కేసీఆర్ ను మూడోసారి సీఎంను చేసేందుకు పార్టీ ఎవ్వరినీ నిర్ణయిస్తే ఆ అభ్యర్థి గెలుపు కోసం ప్రయత్నించాలన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈసారి 14 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవాలని కేటీఆర్ కోరారు. గత ఎన్నికల్లో కొల్లాపూర్ ఓటమి పాలైందనే విషయాన్ని గుర్తు చేశారు.