హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సెంటర్లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి కేంద్రం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నెల రోజుల్లో హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పీఎం కేర్స్ నుండి నిధులు విడుదల చేసినట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి… నిధులు విడుదల చేసినందుకు ప్రధాని మోదీకి కృతఙ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఏర్పాటుతో నగరంలో ఫార్మా రంగం యొక్క సమగ్ర అభివృద్ధికి మరో పెద్ద అడుగు పడిందని కిషన్ రెడ్డి ట్వీట్ చేసారు. అలానే ఈ ల్యాబొరేటరీ, కోవిడ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ లో కూడా కొత్తగా కోవిడ్ వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్రం అనుమతిచ్చింది.
కాగా హైదరాబాద్‌లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలే కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, సదానంద గౌడలకు లేఖ రాసిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌లో టెస్టింగ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తే నెలకి సుమారు 8 నుంచి 10 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను అదనంగా ఉత్పత్తి చేయవచ్చని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, హైదరాబాద్ నగరంలో ఉన్న జీనోమ్ వ్యాలీ లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు.