తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో అనుబంధం పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శిష్యుడి కోసం చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడం చేయలేదు అని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న గురువుకు శిష్యుడి సహకారం ఉంటుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు. నేను ఆయన సహచరుడిని. స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలిచి టీడీపీలోకి వెళ్లాను. ఎవ్వరో బుద్దిలేని వాడు శిష్యుడు, గురువు అని మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికలు జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కుప్పకూలిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 39.50 శాతం ఓట్లు వచ్చాయి. లోక్ సభ ఎన్నికల్లో మా ఓటు షేర్ పెరిగినా.. లేదా తగ్గకున్నా మేమ పాసైనట్టేనని తెలిపారు. కేవలం 100రోజుల్లోనే అన్ని అయిపోవాలంటే ఎలా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్.ఆర్. ట్యాక్స్ అనేవి గాలి మాటలు.. తాను ఎవ్వరికీ కాంట్రాక్టులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.