తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు రాష్ట్రమంతటా ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడుతామని చెప్పారు. ఇకపై రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు లింక్ ఉండదని, వేర్వేరుగా కార్డులు జారీ చేస్తామని సీఎం చెప్పారు. ప్రజా పాలనలో ప్రతి కుటుంబం నుంచి అందుకు అవసరమైన వివరాలను సేకరిస్తామన్నారు. రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన కార్యక్రమానికి నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
తాజాగా సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక హెల్త్ డిజిటల్ కార్డుకు సంబంధించి ఫ్రాన్స్ లో ఉత్తమమైన విధానం అనుసరిస్తున్నారని ఇటీవల విదేశీ పర్యటనలో తనను కలిసిన ప్రతినిధులు చెప్పారని, అక్కడ అనుసరించే విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే హెల్త్ కార్డు ప్రామాణికంగా ఉంటుందని సీఎం అన్నారు