ఎవ్వరయినా ఓట్లు దండుకోవచ్చు.. తప్పేం కాదు.. ఎవ్వరయినా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయవచ్చు..అది కూడా పార్టీల వ్యూహం కావొచ్చు. అది కూడా తప్పు కాదు.. కానీ సున్నిత అంశాల విషయంలో దేశ భద్రతను., పౌర స్వేచ్ఛను కాపాడే బాధ్యత కూడా పార్టీలదే కదా ! కానీ కాంగ్రెస్ మాత్రం ఎందుకో ఈ మధ్య అతి చేస్తుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
అసలు అగ్నిపథ్ ఆందోళనలలో ప్రధానం వినపడిందే ఎన్.ఎస్.యు.ఐ. పేరు.. అంటే నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఇండియా పేరు.. ఈ సంస్థ కాంగ్రెస్ కు అనుబంధంగా ఉండే విద్యార్థి విభాగం. మరి ! ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మాట్లాడుతున్న మాటలన్నీ రాజకీయం కోసమేనా అన్న అనుమానాలే ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంటే ప్రజల జీవనాన్ని స్తంభింపజేసి, ఓటు బ్యాంకు పెంచుకోవడం ఇప్పటి రాజకీయమా అని కూడా బీజేపీ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.
ముఖ్యంగా శాంతియుత ఆందోళనలకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. నిన్నటి భారత్ బంద్ వేళ కూడా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష అంటూ హడావుడి చేసింది. అగ్నిపథ్ ను కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందా లేదా మద్దతు ఇస్తుందా అన్నది వేరే విషయం. కానీ ఓ పార్టీ స్థాయిలో చేపట్టే నిరసనలు ఈ విధంగా శ్రుతి మించి ఉండకూడదు అన్నది ఓ ప్రాథమిక స్థాయిలో వినిపిస్తున్న అభిప్రాయం. ఆ మాటకు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితికి కూడా ఇవే మాటలు వర్తిస్తాయి.
ఎందుకంటే ఆ పార్టీ నాయకులు కూడా మొన్నటి వేళ శవ రాజకీయమే చేశారన్నది తేటతెల్లం అయిందని బీజేపీ అంటోంది. అగ్నిపథ్ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ విషయమై ఆ పార్టీ కూడా శవ రాజకీయమే చేసిందని బీజేపీ మండి పడుతోంది. రాకేశ్ శవ యాత్రలో భాగంగా బీఎస్ఎన్ఎల్ ఆఫీసుపై దాడులు చేసింది.. రాళ్లు రువ్వింది. ఇవి కూడా విజువల్ గా రికార్డు అయ్యాయి. మరి! అగ్నిపథ్ ను వ్యతిరేకించే పద్ధతి ఇదేనా !లేకపోతే ఇది కూడా నాలుగు ఓట్లు దండుకునేందుకు చేస్తున్న ఎత్తుగడా అన్నది ఇప్పుడు బీజేపీ బీట్ నుంచి వస్తున్న ప్రశ్న. కనుక పార్టీల నాయకులు సమన్వయం పాటిస్తే చాలు సమస్యలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి.