తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై శ్వేత పత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ స్వేద పత్రం విడుదల చేసింది. అయితే బిఆర్ఎస్ విడుదల చేసిన ఈ స్వేద పత్రంపై ఘాటు విమర్శలు చేశారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.
మంగళవారం ఢిల్లీ పర్యటనకు ముందు ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏదో సాధించినట్లు బిఆర్ఎస్ స్వేద పత్రం అంటూ రిలీజ్ చేసిందని.. ఆ బావ, బావమరిది వాళ్ళు ఏదో కష్టపడి చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారని కేటీఆర్, హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేశారు. అది తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అని.. వాళ్ళు చేసిన అప్పుల్ని తీర్చాలంటే తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామన్నారు భట్టి. త్వరలోనే జ్యుడీషియల్ ఎంక్వయిరీని కూడా ప్రారంభిస్తామన్నారు. ఇక నేడు ప్రధాని మోదీ తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టానున్నట్లు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనట్లు తెలుస్తోంది.