హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

-

భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం ఇవాళ కాస్త చల్లబడింది. ఈరోజు తెల్లవారు జాము నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. హైదరాబాద్​లోని నేరేడ్‌మెట్‌, కుత్భుల్లాపూర్‌, సైదాబాద్‌, ముషీరాబాద్‌, వనస్థలిపురం.. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్‌, భాగ్యలత, ఆటోనగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, అనాజ్‌పూర్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది.

ఏకధాటిగా పడుతున్న వర్షానికి నగరంలోని పలు చోట్ల నాలాలు పొంగిపొర్లాయి. రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు నిలిచింది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తూ వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల వృక్షాలు విరిగిపడటంతో ముందు జాగ్రత్తగా అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి.. పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు.

ఉదయాన్నే వర్షం కురుస్తుండటంతో పనులపై బయటకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కార్యాలయాలకు వెళ్లే వారు వానలో తడుస్తూనే వెళ్తున్నారు. ఇన్నిరోజులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు ఇవాళ వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version