కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపబోవు – బండి సంజయ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి స్పందించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కర్ణాటకలో ఓడినా బిజెపి ఓటు బ్యాంకు ఎక్కడ చెక్కుచెదరలేదు అన్నారు. అలాగే కర్ణాటక ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రంలో వచ్చిన ఫలితాల ప్రభావం మరో రాష్ట్రంపై ఉంటుందనుకోవడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ – బిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అన్నారు.

హిందుత్వ ఎజెండా, అభివృద్ధి నినాదంతో తాము ముందుకు వెళతామని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. హిందువులలో చైతన్యం నింపడానికి నేడు కరీంనగర్ లో హిందూ ఏక్తాయాత్ర చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ యాత్రకు అసోం సీఎం హిమంత్ కుమార్ శర్మ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు. కరీంనగర్ లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు వైశ్య భవన్ నుంచి ఈ హిందూ ఏక్తాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.