హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి షురూ అయింది. భక్తులంతా గణేశ్ మండపాలకు వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే చాలా మండపాల్లో గణపయ్య కొలువుదీరాడు. రేపు గణేశ్ చతుర్థి కావడంతో హైదరాబాద్‌లోని పూలు, పండ్ల మార్కెట్లన్నీ కళకళలాడుతున్నాయి. వినియోగదారులు రేపటి గణేశ్ పూజ కోసం పూలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు.
మరోవైపు ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి మొదలైంది. వినాయక చవితికి ఒక రోజు ముందే ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది శ్రీదశ మహా విద్యాగణపతిగా భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. 11 రోజుల పాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో రేపు ఉదయం 9.30 గంటలకు తొలి పూజ ప్రారంభం కానుంది. 11 గంటలకు ఖైరతాబాద్ గణేశుడిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకోనున్నారు.
మరోవైపు, గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు చేశారు.