ఇవాళ ప్రకటించిన ఎన్నికల తేదీలను చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 30 ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్.. ఈ తేదీలను చూస్తుంటే కరెక్ట్‌గా ఈసారి మనకు లెక్క కూడా కుదిరినట్టు ఉందని కేటీఆర్ తెలిపారు. 30, 03, కేసీఆర్ మూడోసారి కూడా ముఖ్యమంత్రి అవుడు హ్యాట్రిక్ పక్కా అనిపిస్తుంది. మనకు అన్ని కలిసి వస్తున్నాయి. మూడు మూడు ఆరు.. మన లక్కీ నంబర్ కూడా ఆరే. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుడు కూడా పక్కానే ఉన్నది. తేదీలు కూడా మంచిగానే కుదిరినట్టు అనిపిస్తుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎలక్షన్లు వచ్చాయి.. ఇక సంక్రాంతి పండుగకు గంగిరెద్దుళ్లోళ్లు వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు వస్తారని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చిన కథలు చెబుతారు. కేసీఆర్, ధర్మారెడ్డిని ఓడించమని చెబుతారు. విచక్షణతో, ఆలోచనతో చైతన్యాన్ని ప్రదర్శించి ఓటేయాలి. క్యాలికులేటేడ్గా ఆలోచించాలి. ఆగం కావొద్దు. 2014లో మన పరిస్థితి ఏంది..? ఇప్పుడు పరిస్థితి ఏంది? అనేది ఆలోచించాలి. కరెంట్, మంచినీళ్లు, వ్యవసాయం, సాగునీటి, సంక్షేమం గురించి ఆలోచించండి. రెచ్చగొట్టే ముచ్చట్లు చెబితే ఆగం కావొద్దు.. ఆందోళన చెందొద్దు. మేం చెప్పింది వాస్తవమైతే ధర్మారెడ్డిని 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కేటీఆర్ కోరారు.