హైదరాబాద్ అధికారులకు మేయర్ కీలక ఆదేశాలు..!

-

వాతావరణ శాఖ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా రెడ్ అలార్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అన్ని వేళల అందుబాటులో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్ తో ఆదివారం GHMC మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు సర్ ప్లస్ అవుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. అధికారులు సిబ్బంది అన్నివేళలా అందుబాటులో ఉండాలని, సెలవులలో వెళ్ళరాదని, ఎలాంటి సెలవులు ఇవ్వబడవని స్పష్టం చేశారు.

శిధిలవస్థలో ఉన్న భవనాలు, కాంపౌండ్ వాల్స్ గుర్తించి తగిన జాగ్రతలు తీసుకోవాలన్నారు. కన్స్ట్రక్షన్ సైట్లలో తాత్కాలికంగా పనులు ఆపాలని, లేబరును సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా బిల్డర్లకు సూచించాలని టౌన్ ప్లానింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సిసిపి శ్రీనివాస్ కు మేయర్ ఆదేశించారు. నాళాలు, స్టార్మ్ వాటర్ డ్రైన్ లలో నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తూ, పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అవసరమైన చోట పునరావాస కేంద్రాలకు తరలించాలని మేయర్ అధికారులకు సూచించారు. డిప్యూటీ కమిషనర్లు, ఏ ఎం ఓ హెచ్ లు, ఈ ఈ లు క్షేత్ర పరిధిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అదేవిధంగా సర్కిల్ ఆఫీసులలో గల కంట్రోల్ రూమ్ ఫోన్ సరిగ్గా పనిచేసేలా చూసుకోవాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version