అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ తనయుడు రాజీవ్ ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే జోగి రాజీవ్ అరెస్ట్ చేయడం పై జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే తన కుమారుడు రాజీవ్ ని అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం నులకపేటలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ఆయన మాజీ మంత్రి జోగి రమేష్, తనయుడు రాజీవ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జోగి రాజీవ్ నకిలీ పత్రాలతో అగ్రిగోల్డ్ భూములు అమ్ముకున్నారని.. అలాంటి వారిని వదిలిపెట్టాలా..? అని మండిపడ్డారు. ప్రజలకు చెందాల్సిన భూములను అక్రమంగా అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. చట్టాలను ఉలంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తప్పు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. అవినీతికి పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేశ్.