నిర్మల్‌లో అదిరే ట్విస్ట్..ట్రైయాంగిల్‌లో గెలిచేదెవరు?

-

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ సీటు ఏదైనా ఉందంటే అది నిర్మల్ నియోజకవర్గమనే చెప్పాలి. నిర్మల్ లో రాజకీయ పోరు ఎప్పుడు రసవత్తరంగానే సాగుతుంది. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ త్రిముఖ పోరు జరుగుతుంది. 2009లో కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పోరు నడవగా, పి‌ఆర్‌పి నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గెలిచారు.

2014లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌ఎస్‌పిల మధ్య పోరు జరిగింది. బి‌ఎస్‌పి నుంచి ఇంద్రకరణ్ రెడ్డి గెలిచారు. తర్వాత ఈయన బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. 2018లో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పిల మధ్య పోరు నడిచింది. బి‌ఆర్‌ఎస్ నుంచి ఇంద్రకరణ్ గెలిచారు. ఈ సారి ఎన్నికల్లో కూడా ఆ మూడు పార్టీల మధ్యే పోరు నడవనుంది. కాకపోతే ఈసారి అభ్యర్ధులు అటు ఇటు మారుతున్నారు.

బి‌ఆర్‌ఎస్ నుంచి ఇంద్రకరణ్ పోటీ చేయడం ఖాయమే..ఈయన గతంలో కాంగ్రెస్, బి‌ఎస్‌పిల్లో పనిచేసి..2014 తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇటు బి‌జే‌పి నుంచి మహేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారు. ఈయన 2009లో ప్రజారాజ్యం నుంచి గెలిచి..నెక్స్ట్ కాంగ్రెస్ లోకి వచ్చి 2014, 2018 ఎన్నికల్లో ఓడిపోయి..ఇప్పుడు బి‌జే‌పిలోకి వచ్చారు. ఇక కాంగ్రెస్ నుంచి శ్రీహరి రావు పోటీ చేస్తారని తెలుస్తుంది.

ఈయన 2009, 2014 ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో పోటీ చేయలేదు. ఇప్పుడు బి‌ఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరే ఛాన్స్ ఉంది. దీంతో నిర్మల్ లో త్రిముఖ పోరు జరగడం ఖాయమే. ఇక ఇక్కడ సమీకరణాలు మారిపోతాయి. శ్రీహరి రావు కాంగ్రెస్ లో పోటీ చేస్తే..బి‌ఆర్‌ఎస్ లోని ఓ వర్గం ఓట్లు కాంగ్రెస్‌కు పడే ఛాన్స్ ఉంది. ఇటు బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ముస్లిం, దళిత ఓట్లని చీల్చుకుంటే బి‌జే‌పికి మేలు జరుగుతుందనే చర్చ ఉంది. అసలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని బి‌జే‌పి, కాంగ్రెస్ చీల్చుకుంటే తమకు లాభమని బి‌ఆర్‌ఎస్ భావిస్తుంది. చూడాలి మరి చివరికి నిర్మల్ ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news