లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు రిమాండ్ విదించింది. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా.. పోలీసులు జైలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడంగల్ కోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నరేందర్ రెడ్డిని తరలిస్తున్న కారును బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇవాళ ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి నరేందర్ రెడ్డిని వికారాబాద్ తరలించారు. అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ కి తరలించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కొడంగల్ కోర్టుకు తరలించారు. వికారాబాద్ వద్ద బీఆర్ఎస్ నేతలు భారీగా తరలిరావడంతో పరిగి తీసుకెల్లారు. కలెక్టర్ పై దాడి కేసులో మొత్తం 52 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ నారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు. దాడి చేసిన వారిలో సురేష్ కీలకంగా వ్యవహరించినట్టు వెల్లడించారు.