రాజేంద్రనగర్‌లో పంచముఖ పోరు..కారుకు ఎం‌ఐ‌ఎంతో చిక్కులు.!

తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ చివరిలో ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ సారి పోరు రసవత్తరంగా సాగేలా ఉంది. గత ఎన్నికల్లో పూర్తిగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి వన్ సైడ్ గా ఫలితం వచ్చింది. కానీ ఈ సారి అలా ఉండేలా లేరు. అక్కడ విచిత్రమైన పోటీ నేలకొనేలా ఉంది. దాని గురించి ముందు రాజేంద్రనగర్ గురించి మాట్లాడుకుంటే..ఇక్కడ తెలంగాణ ఓటర్లతో పాటు ఏపీ నుంచి వచ్చి సెటిల్ అయిన వారు కూడా ఎక్కువే.

అందుకే ఇక్కడ టి‌డి‌పి విజయాలు సాధించింది. 2008లో ఏర్పడిన ఈ స్థానంలో 2009 ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి ప్రకాష్ గౌడ్ విజయం సాధించారు. ఇక 2014 ఎన్నికల్లో కూడా అదే ఊపుతో ప్రకాష్ గౌడ్ టి‌డి‌పి నుంచి గెలిచారు. అయితే తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ప్రకాష్ టి‌డి‌పిని వదిలి బి‌ఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఇక 2018 ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫైట్ నడిచింది. వాస్తవానికి బి‌ఆర్‌ఎస్, ఎం‌ఐ‌ఎం పార్టీలు ఒక అవగాహనలో ఉంటాయి. ఎం‌ఐ‌ఎం పార్టీకి పట్టున పాతబస్తీలోని 7 స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ మొక్కుబడిగా పోటీ చేస్తుంది.

 TRS & MIM

ఇక రాష్ట్రంలో ఎం‌ఐ‌ఎం అన్నీ స్థానాల్లో పోటీ చేయదు..మిగతా స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తుంది. కానీ గత ఎన్నికల్లో రాజేంద్రనగర్ సీటు వదులుకోవాలని బి‌ఆర్‌ఎస్ పార్టీకి ఎం‌ఐ‌ఎం హెచ్చరిక పంపింది. అయినా సరే బి‌ఆర్‌ఎస్ నుంచి ప్రకాష్ గౌడ్ బరిలో దిగారు. ఇటు కాంగ్రెస్ తో పొత్తులో టి‌డి‌పి పోటీ చేసింది. ఇక ఎం‌ఐ‌ఎం పార్టీ కూడా పోటీ చేసింది. ఇక టి‌డి‌పిపై 58 వేల ఓట్ల మెజారిటీతో ప్రకాష్ గెలిచారు. అటు ఎం‌ఐ‌ఎంకి 46 వేల ఓట్ల వరకు పడ్డాయి. బి‌జే‌పికి 20 వేల ఓట్లు వరకు పడ్డాయి.

అయితే ఈ సారి రాజేంద్రనగర్ లో పోరు రసవత్తరంగా  మారేలా ఉంది. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, బి‌జే‌పి, ఎం‌ఐ‌ఎం, టి‌డి‌పిలు పోటీ చేయనున్నాయి. దీంతో ఓట్ల చీలిక భారీగా జరిగేలా ఉంది. మరి ఈ క్రమంలో రాజేంద్రనగర్ లో ఈ సారి ఎవరి గెలుస్తారో చూడాలి.