రామోజీ గ్రూప్స్ ఛైర్మన్ రామోజీరావుకు అశ్రునయనాల మధ్య ఆయన కుటుంబం, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు కిరణ్ దహనసంస్కారాలు జరిపారు. అశ్రునయనాలతో కుటుంబసభ్యులు, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు అంతిమ వీడ్కోలు పలికారు.
అంతిమయాత్ర వాహనంపై కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్, కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, కీర్తి సోహన, మనవడు సుజయ్, కుటుంబసభ్యులు ఉన్నారు. వీరితో పాటు సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుజనా చౌదరి తదితరులు వాహనంపై ఉన్నారు. రామోజీరావు అంతిమ సంస్కారాలకు చంద్రబాబు నాయుడు హాజరై పాడె మోశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు జరిగాయి. గాల్లోకి తుపాకులు పేల్చి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం రామోజీ చితికి ఆయన కుమారుడు కిరణ్ నిప్పు పెట్టారు.