ఇందిరమ్మ ఇండ్లలో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు మంత్రి సీతక్క. సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ఆవిష్కరించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. అనంతరం మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరేట్ హెల్ప్ లైన్ లో పది మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ అన్నారు.
అందుకే వాళ్లకి ఉపాధి కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. సంక్షేమం, విద్య, ఉద్యోగ రంగాల్లో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు మంత్రి సీతక్క.