సమతామూర్తి విగ్రహావిష్కరణకు వచ్చిన సమయంలో కేసీఆర్ రావద్దని పీఎంఓ నుంచి ఆదేశాలు అందాయని మంత్రి కేటీఆర్ చెప్పడంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మండిపడ్డారు. పీఎంఓ నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అబద్దమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని గౌరవించే స్థితిలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లేరని విమర్శించారు. ప్రధాని హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో కనీసం స్వాగతించలేదని… పైగా అబద్దాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ ప్రధానిని స్వాగతించేందుకు రాలేదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ప్రభుత్వం తరుపున ప్రధానిని స్వాగతించారు. ఈ విషయంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. కేసీఆర్ అనారోగ్యం కారణంగా ఆసమయంలో ప్రధానిని ఆహ్వానించేందుకు వెళ్లలేదు. అయితే తాజాగా ఈ అంశంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భారత్ బయోటెక్ సందర్శన సమయంలో, ఇటీవల సమతామూర్తి విగ్రహావిష్కరణ సయమంలో ప్రధానిని స్వాగతించేందుకు రావద్దని పీఎంఓ నుంచి ఆదేశాలు వచ్చాయని… ముఖ్యమంత్రిని అవమానించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.