ఫామ్​హౌస్ కేసు విచారణ.. కాస్త న్యాయవాదుల్లా వాదించండంటూ హైకోర్టు వ్యాఖ్యలు

-

మొయినాబాద్ ఫామ్​హౌస్​లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులకు ఇచ్చిన 41 ఏ నోటీసులపై హైకోర్టులో విచారణ జరిగింది. బి.ఎల్.సంతోష్ విచారణకు హాజరు కాలేదని ఏజీ ప్రసాద్ కోర్టుకు వివరించారు. ఇతర పనుల్లో బిజీగా ఉండడం వల్లే హాజరు కాలేదని బీజేపీ తరఫు న్యాయవాది రామచందర్ రావు హైకోర్టుకు తెలిపారు. ఇతర పనులున్నాయని చెప్పడం సరైన సమాధానం కాదని ఏజీ అన్నారు. సాక్ష్యాల తారుమారుకే ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

సంతోష్ అనారోగ్యసమస్యలతో బాధపడుతున్నారని బీజేపీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. కొంత సమయం కావాలని సంతోష్‌ సిట్‌కు లేఖ రాశారని తెలిపారు. 41ఏ నోటీసులను సవాల్‌ చేయాలనుకుంటే సంతోష్ నేరుగా హైకోర్టును ఆశ్రయించొచ్చని జడ్జి సూచించారు. సంతోష్‌తో మాట్లాడి కోర్టుకు చెబుతామని బీజేపీ తరఫు న్యాయవాది రామచందర్‌రావు తెలిపారు. ఏఏజీ, లాయర్​ రామచందర్ రావు వాదిస్తుండగా హైకోర్టు జడ్జి జోక్యం చేసుకున్నారు. టీఆర్ఎస్, బీజేపీ న్యాయవాదుల్లా కాకుండా వృత్తిపరంగా వాదించాలని సూచించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version