తెలంగాణ వాతావరణం చల్లబడుతోంది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు ఉపశమనం లభిస్తోంది. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటం, ఆకాశం మేఘాలతో నిండిఉండటంతో గత రెండు రోజులుగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడాని వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు తెలంగాణలోని చాలా జిల్లాల్లో 40 డిగ్రీల కన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న మోస్తారు వర్షం కురిసింది. కర్ణాటక, తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 25 వరకు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.