ఫిబ్రవరి నెల దాటకముందే రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం పది దాటితే బయట అడుగుపెట్టడం నరకంగా ఉంటోంది. తప్పనిసరి అయితే తప్ప మధ్యాహ్నం పూట ప్రజలు గడప దాటడం లేదు. ఇక ఏప్రిల్, మే నెలలో ఎండలు మరింత మండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఓ వైపు ఇలా ఎండలు మండుతుంటో మరోవైపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు 12 జిల్లాల్లో అక్కడక్కడ వాన కురిసిందని వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం నెమ్మానిలో 3.1 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోడ్‌లో 2.2, రాజన్న సిరిసిల్ల జిల్లా మాడ్గులలో 1.6 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని పేర్కొంది. మరోవైపు ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.