బలోపేతానికి కమలం కసరత్తు టార్గెట్ 2024

-

2024లో అధికారం సాధించాలి….ఇది ప్రస్తుతం కాంగ్రెస్ ముందున్న లక్ష్యం. కేంద్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోయి పదేళ్లవుతోంది. మరి మోడీ చరిష్మా ముందు నిలబడాలంటే ఆ పార్టీకున్న బలం సరిపోదు. అందుకే ఈ జాతీయ పార్టీ చాలా రాష్ట్రాల్లో రాజీపడి ఇతర పార్టీ లకు దగ్గరవాలని చూస్తోంది. ఇప్పటికే కొంతమందికి ఏకతాటిపైకి తెచ్చింది. వాళ్ళందరూ మోడీ వ్యతిరేకులు కాబట్టి కాంగ్రెస్ తో కలవడం ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉన్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట.పైగా కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ అవడం కష్టమేనని వారే చెబుతున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అనూహ్య విజయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో విశ్వాసాన్ని పెంచి ఉండొచ్చు.

దానికి తోడు భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ ఇమేజ్‌ని పెంచేసిందని, ఆ ఇమేజ్ తో ఇపుడు రాహుల్ గాంధీ .. నరేంద్ర మోదీని ఈజీగా ఎదుర్కొనగలరని కాంగ్రెస్ నేతలు ధీమాకి వచ్చేసారు. అందువల్లే సోషల్ మీడియాలో నరేంద్ర మోదీపైనా, బీజేపీ పాలనపైనా వ్యతిరేక ప్రచారాన్ని తెగ చేసేస్తున్నారు. ఒకవైపు విపక్ష పార్టీలన్నీ ఏకం కావడానికి సర్వ శక్తులు ఒడ్డుతూ ఉంటే అధికార ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటికే పలు పార్టీ లు దూరమయ్యాయి. మళ్లీ వారందరితోనూ జత కట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దృష్టి సారించారు.

మహారాష్ట్రలో శివసేన నుంచి బయటికి వచ్చిన ఏక్‌నాథ్‌ షిండేని సీఎం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆ పార్టీ గుర్తును కూడా లాగేసుకున్నారు. అయితే ఇప్పుడు తాజా పరిస్థితి ఏమిటంటే షిండే వైఖరి బీజేపీకి కొరకరాని కొయ్యగా మారింది.అక్కడ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కంటే ముఖ్యమంత్రిగా ఉన్న తనకే ఎక్కువ జనాదరణ ఉందని బిల్డప్ ప్రకటనలు ఇస్తున్నారూ సీఎం ఏకనాథ్‌ షిండే. ఈ విధానం పట్ల బీజేపీ ఆగ్రహంగా ఉంది. ఇక తమిళనాడులో మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే నేతల తీరు వలన ఇరు పార్టీల మధ్య అంతరం పెరుగుతోంది.ఈ క్రమంలో ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పలువురు మిత్ర పక్షాలతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ కూడా ఇందులో భాగమేనని అంటున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడిన జేడీఎస్‌ ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో చేతులు కలపాలని చూస్తోంది. ఇటీవల కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి విపక్షాలన్నీ దూరంగా వుంటే మాజీ ప్రధాని దేవెగౌడ మాత్రం హాజరయ్యారు.ఇది అసలు ఊహించని పరిణామం. ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్లు కూడా ఆసక్తి రేపాయి. దీంతో జేడీఎస్ బీజేపీతో కలిసి పోటీ చేయడం దాదాపుగా ఖాయమేనని తెలిసిపోయింది. బీహార్‌లో నితీశ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి విభేదాల కారణంగా ఇటీవల బయటకు వచ్చిన వికాశ్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (వీఐపీ) చీఫ్‌ ముకేశ్‌ సాహ్ని ని కూడా బీజేపీ కలుపుకోవాలని చూస్తోంది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఓం ప్రకాశ్‌ రాజ్‌బహార్‌కు చెందిన సుహెల్‌దేవ్ తో బీజేపీ నేతలు మంతనాలు ప్రారంభించారు.

అన్ని వైపుల నుంచి ఎన్డీఏని బలోపేతం చేయడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువున్న నేపథ్యంలో విపక్షాల కూటమి కార్యాచరణ రూపొందిస్తుంటే.. ఎన్డీఏను బలోపేతం చేసే దిశగా కమలనాథులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ, అటు విపక్షాలు నానా హడావుడి చేస్తూ దేశంలో ఎన్నికల వాతావరణం తెచ్చేశారు

Read more RELATED
Recommended to you

Latest news