ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు రూపొందుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టు ప్రాబల్యం తగ్గిందనుకున్న తరుణంలో గత కొద్ది రోజులుగా మావోలు అడవులలో సంచరిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. మావోయిస్టులు జిల్లాలో ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. తమ ఉనికిని కాపాడుకోవడం కోసం దాడులు చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది.
దీంతో అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ నిఘా పెట్టారు. ప్రజలు ఎవరు మావోయిస్టులకు సహకరించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అడెల్లు అలియాస్ ( భాస్కర్) సారథ్యంలోని టీం ఉమ్మడి ఆదిలాబాద్ అడవుల్లో తిరుగుతున్నట్లు పోలీస్ శాఖ ధ్రువీకరించింది. సరిహద్దు ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని.. అటవీ ప్రాంతంలో నివసించే గ్రామాల ప్రజలు మావోయిస్టులకు భయపడి వారికి ఆశ్రమం కల్పించవద్దని సూచించారు.