“సాలు దొరా… సెలవు దొరా…” విజయశాంతి ట్వీట్‌

-

“సాలు దొరా… సెలవు దొరా…” అంటూ విజయశాంతి ట్వీట్‌ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా తెలంగాణను ఎంచుకోవడం… ప్రధానమంత్రి నరేంద్ర మోదీగారు హైదరాబాద్ రావడం అంతా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే జరుగుతోంది. నమ్మి ఓట్లేసిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన అధికార టీఆరెస్ పార్టీని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా?… అని అవకాశం కోసం రాష్ట్ర ప్రజానీకం ఆత్రంగా ఎదురుచూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు… నిరసనలు కొనసాగుతున్న తీరు, దుబ్బాక, హుజురాబాద్‌లో కాషాయం రెపరెపలను బట్టి… ప్రజలే కేసీఆర్‌ని సాలు దొర… సెలవు దొర అంటున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజల మనోభావాలనే బీజేపీ తెలంగాణ కార్యాలయం వద్ద బోర్డ్ రూపంలో ప్రతిబింబించడం జరిగింది. కేసీఆర్‌కి నిజంగా పౌరుషం ఉంటే… ప్రజల్లో తనపై ఉన్న ఈ ప్రతికూల భావాలను తొలగించుకునేలా పనిచెయ్యాలి గానీ… పోటీగా “సాలు మోదీ… సంపకు మోదీ…” అంటూ పోస్టర్లు పెట్టించడం అలిగి ఏడ్చే చిన్నపిల్లల తీరుగుందని ఫైర్‌ అయ్యారు.

నీ పార్టీని… ప్రభుత్వాన్ని మోడీగారు చంపనక్కర్లేదు. ఆ పని ప్రజలే చెయ్యనీకి సిద్ధంగా ఉన్నరు. ఇది చాలక సరిగ్గా బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ గారిని రప్పించి పోటీ బైక్ ర్యాలీ పెట్టించడం… ఇదంతా వాపును చూసి బలుపు అనుకోవడం తప్ప మరేం కాదు. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాషాయం కళకళలాడింది. ప్రధాని మోదీ పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట జగన్నాథ రథచక్రాల్లా పరుగులు తీస్తోంది. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం నిన్నగాక మొన్ననే రైతులకి బేడీలు తగిలించి మరీ లాక్కెళ్ళిన ఘటన మీడియాలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోపక్క పోడు భూముల కోసం నిరసనలకు దిగిన ఆదివాసీ ఆడపడుచుల వీపులు పగులగొట్టారు… ఇలాంటి దురదృష్టకర సంఘటనలు కేసీఆర్ హయాంలో సర్వసాధారణం అయిపోయాయి. అందుకే మళ్ళీ మళ్లీ చెబుతున్నను… సాలు దొరా… సెలవు దొరా…అంటూ విజయశాంతి ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news