నిజాలు మాత్రమే మాట్లాడండి అబద్ధాలకు తావే లేకుండా చెప్పండి.. ఏం కాదు ఫలితాలు ఎలా ఉన్నా కూడా నిజాలే చెప్పండి..అని గట్టిగానే అరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు. రాజస్థాన్, ఉదయ పూర్ కేంద్రంగా జరుగుతున్న చింతన్ శివిర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న సీనియర్లకూ, టికెట్ల కోసం టెంటు రాజకీయాలు నడిపే జూనియర్లకూ సోనియా క్లాస్ ఇచ్చారు. ఇదే సమయంలో పీవీ లాంటి గత కాలపు నాయకులను స్మరించుకుంటూనే విపక్షాల విమర్శలను సోషల్ మీడియా వేదికగా తిప్పి కొట్టేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఈ నేపథ్యాన తక్షణ ప్రక్షాళనే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఉన్నారు. ఆ విధంగా సోనియా గాంధీ పార్టీలో మార్పులు తేనున్నారు. చింతన్ శివిర్ ను ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడారు. ఇదంతా బాగుంది కానీ అసలు ఈ ప్రాంగణాన మన తెలంగాణ నేత పీవీ నర్సింహారావు చిత్రం లేనేలేదని టీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టింది. కానీ ఆయన ఫొటో కూడిన ఫ్లెక్సీ ఉంది. అంటే ఎందుకు ఇలా మాట్లాడారు అంటే రానున్నవి ఎన్నికల కాలం కనుక అని మండిపడుతున్నారు కాంగ్రెస్ అభిమానులు. ఇదే విషయమై సోషల్ మీడియాలోనూ చర్చోపచర్చలు నడుపుతూ అసత్య ప్రచారాలు తగదని కేసీఆర్ అండ్ కో ను ఉద్దేశిస్తూ కాంగ్రెస్ మాట్లాడుతోంది. వాస్తవానికి తాము ఏనాడూ దిగ్గజ నేత, దార్శినిక నేత అయిన పీవీని విస్మరించలేదని అంటున్నారు.
చింతన వీడితే చాలు.. గెలుపు తథ్యం
ఇక చింతన్ శివిర్ విషయానికే వస్తే పార్టీలో మరిన్ని మార్పులు తీసుకుని రావాలని సోనియా ఆశిస్తూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవసరం అయితే నాయకులు త్యాగాలు చేయాలని కూడా అంటున్నారు అధినేత్రి. అదేవిధంగా సమష్టి కృషితోనే మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు. ఇక ఈ శిబిరంలో మరికొన్ని వ్యూహ ప్రతివ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఏదేమయినప్పటికీ చాలా కాలం తరువాత మరో ప్రత్యేక సందర్భంలో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవడం బాగుంది అదేవిధంగా విపక్షాల విమర్శలనుసైతం సకాలంలో తిప్పికొట్టడం కూడా బాగుంది. వీటి ఫలితాలు ఎలా ఉంటాయి ఎన్ని అమలుకు నోచుకుంటాయి అన్నది వేచి చూడాలిక. ఎందుకంటే అధిష్టానం నిర్ణయాలేవీ దిగువ స్థాయి క్యాడర్ కు చేరవు. చేరినా అవి అమలులో ఉండవు కనుక !