కర్ణాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థి అపార్ట్ మెంట్ 14వ అంతస్తు నుంచి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని నూర్‌నగర్ లేఅవుట్‌లో నివాసముంటున్న మహమ్మద్ నూర్, నొహెరా దంపతుల కుమారుడు మోహిన్ ఖాన్(15)గా గుర్తించారు.
హెగ్డేనగర్లో ఓ ప్రైవేటు స్కూల్లో మోహిన్ ఖాన్(15) పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం స్కూల్లో జరిగిన పరీక్షలో మోహిన్ కాపీ కొట్టాడు. ఈ విషయం ఉపాధ్యాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన విద్యార్థి, ఎవరికీ చెప్పకుండా ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మ హత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి, విద్యార్థి చెయ్యి పట్టుకుని లాగడానికి ప్రయత్నించాడు. అయినా సరే విద్యార్థి ఆ వ్యక్తి నుంచి విడిపించుకుని అక్కడి నుంచి దూకి ప్రాణాలను పోగొట్టుకున్నాడు.
అపార్ట్మెంట్ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. “మృతుడు తన స్నేహితుడి కోసం తరచుగా అపార్ట్మెంట్కు వచ్చేవాడు. అందుకనే తనని అపార్ట్మెంట్ లోపలికి వెళ్లనిచ్చాని” సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు. పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.