తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బీసీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బొత్స సత్యనారాయణ, ముత్యాల నాయుడు, జయరాం, జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తదితర ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాబోయే రోజులలో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు.
ఇక సమావేశం అనంతరం మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. డిసెంబర్ 8వ తేదీన విజయవాడలో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ బీసీ సదస్సుకు సీఎం జగన్ ను ఆహ్వానిస్తున్నామన్నారు. బీసీల గురించి సీఎం జగన్ ఎన్నికల ముందు నుంచి ఆలోచించారని అన్నారు. బీసీ వర్గాల జీవన విధానంలో మార్పులు తీసుకుని రావడానికి జగన్ ఒక డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. 139 బీసీ కులాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి సంక్షేమ ఫలాలను అందించారని తెలిపారు.