మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు నుపుర్ శర్మను వెంటనే అరెస్ట్ చేయాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఈ మేరకు ఏఐఎమ్‌ఐఎమ్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ చేసిన వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదన్నారు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల నేపథ్యంలో నుపుర్ శర్మను ఉరితీయాలని గతంలో ఎంపీ ఇంతియాజ్ ఆరోపించారు. నుపుర్ శర్మను ఉరి తీయాలని, ఆమెను స్వేచ్ఛగా వదిలేస్తే.. అల్లర్లు జరగడాన్ని ఆపలేమని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దీంతో పార్టీ అధినేత ఓవైసీ స్పందించారు.
ఈ సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. దేశంలోని చట్టాల ప్రకారమే నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే ఆమెను శిక్షించాలని అన్నారు. పార్టీలోని అందరూ ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారన్నారు. ఎంపీ ఇంతియాజ్ వ్యాఖ్యలకు తమ పార్టీకి సంబంధం లేదన్నారు. కాగా, ఇంతియాజ్ వ్యాఖ్యలను శివసేన పార్టీ కూడా ఖండించింది. ఆ పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ.. ఇంతియాజ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని, బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ.. రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.