మహిళలు ఏదైనా అనుకుంటే.. కచ్చితంగా చేసి చూపిస్తారు. వాళ్లకు రాని పనంటూ.. ఏది ఉండదు. దిగనంత వరకే.. వన్స్ ఐ స్టెప్ ఇన్.. హిస్టరీ రిపీట్.. అని మూవీలో డైలాగ్ లేడీస్ కి బాగా సూట్ అవుతుంది. ఎంత కష్టమైనా పనులైనా, మునుపెన్నడూ చేసిన అవగాహన లేకపోయినా… సందర్భాన్నిబట్టీ వారు ఆ పనిలో నిపుణులవుతారు. ఏ తల్లికి బిడ్డను ఎలా చూసుకోవాలో వేరే చెప్పక్కర్లేదు.
పెళ్లేతే.. ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో.. ఏ అమ్మాయికు స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆటోమెటిక్ గా సమయం వచ్చినప్పుడు సంవయనంతో చేసుకుపోతారు. పుణెకు చెందిన యోగిత సతవ్ ఇందుకు చక్కని ఉదాహరణ. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ నిండు ప్రాణాన్ని కాపాడారామె. ఆమె ఆత్మవిశ్వాసం, ప్రదర్శించిన ధైర్య సాహసాలే ఓ కుటుంబాన్ని నిలబెట్టాయి..
అది..జనవరి 7, 2022. 20 మంది మహిళలు కలిసి ఓ మినీ బస్సులో పిక్‌నిక్‌కు వెళ్లారు. పుణె శివార్లలో సరదాగా గడపాలని భావించారు. కానీ ఇంతలో అనుకోని ఉపద్రవం ముంచుకువచ్చింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు అతడిని ఎలా కాపాడాలో అర్థంకాక సతమతమయ్యారు.
42 ఏళ్ల యోగిత మాత్రం అలా చూస్తూ ఊరుకోలేకపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. గతంలో కారు నడిపిన అనుభవం ఉన్న ఆమె.. బస్సును ఎప్పుడు నడిపింది లేదు.. అయినప్పటికీ.. బస్సును ముందుకు పోనిచ్చారు. 35 కిలోమీటర్ల పాటు డ్రైవింగ్ చేసి సదరు డ్రైవర్‌ను ఆసుపత్రికి చేర్చారు. కథ సుఖాంతమైంది.
కొటక్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ #DriveLikeALady క్యాంపెయిన్‌లో భాగంగా యోగిత ధైర్యసాహసాలపై ఓ యాడ్ ఫిల్మ్ చేసింది. ఆపత్కాలంలో ఆమె వ్యవహరించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని కితాబునిచ్చారు. మహిళా డ్రైవర్ల సేవల పట్ల సానుకూలతతో ముందుకు సాగేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
యోగిత బస్సు నడిపే వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. యోగితపై ప్రశంసల జల్లు కురుస్తోంది. హ్యాట్సాఫ్ యోగిత అంటూ నెటిజన్లు ఆమెను కొనియాడుతున్నారు. గత 20 ఏళ్లుగా మారుతి సెలరియో, అసెంట్, ఓమిని వ్యాన్ నడుపుతున్నాను. అయితే, బస్సు నడపడం ఇదే తొలిసారి అని ఆమె పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మనం కూడా ఆమెను ప్రశంసిద్దామా..!
-Triveni Buskarowthu