బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హిందూ కార్యక్రమాలలో ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. శ్రీరామనవమి శోభాయాత్రను 2010 నుంచి రాజాసింగ్ నేతృత్వంలో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా అంతకముందు రెండేళ్లు హైదరాబాద్ నగర పరిధిలో శోభాయాత్ర నిర్వహించలేదు. ఇక గతేడాది శ్రీరామనవమి శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అయితే ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిర్వహించే శ్రీరామనవమి శోభాయాత్రకు ఉగ్రవాద సంస్థ తనపై కుట్ర పన్నుతుందని రాజాసింగ్ ఆరోపించారు. హైదరాబాద్ లో గురువారం శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా తనను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడే అవకాశం ఉందని రాజాసింగ్ పేర్కొన్నారు. ఊరేగింపు సందర్భంగా బిజెపి ఆఫీస్, తనపై బాంబులు విసిరేందుకు ప్లాన్ చేశారని.. బహ్రయిన్ లోని ముక్తార్ బ్రిగెడ్స్ లో పనిచేస్తున్న ఉగ్రవాది తనకు లేఖ పంపినట్లుగా తెలిపారు. ఊరేగింపులో లక్షలాదిమంది రామ భక్తులు పాల్గొంటున్నందున భద్రతపై అప్డేట్ ఇవ్వాలని డిజిపి, హోం మంత్రిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు రాజా సింగ్.