ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన సతీమణి మెలిండా గేట్స్‌లు మే 3వ తేదీన విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. ఈ విషయం సంచలనం సృష్టించింది. వృద్ధాప్యంలో వారు విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఇకపై తాము జంటగా కలిసి ఉండబోమని, కానీ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరఫున ఇద్దరమూ కలసి పనిచేస్తామని, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు.
అయితే బిల్‌గేట్స్, మెలిండా గేట్స్ లు విడిపోవడం వెనుక చైనాకు చెందిన జి షెల్లీ వాంగ్ అనే మహిళ ప్రమేయం ఉందని పుకార్లు వస్తున్నాయి. అయితే వాటిపై వాంగ్ స్పందించింది. తాను బిల్ గేట్స్ దంపతులకు చైనా ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్నానని, వారి సామాజిక సేవా కార్యక్రమాల కోసం ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్నానని తెలిపింది. అంతేకానీ వారిద్దరూ విడిపోయేందుకు తాను కారణం కాదని ఆమె తెలియజేసింది. ఈ మేరకు ఆమె తన సోషల్ ఖాతాల్లో మాండరిన్ భాషలో విషయాన్ని వివరించింది.
అయితే వాంగ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడాన్ని ఆమె స్నేహితులు ఖండించారు. వాంగ్ మంచి మనిషి అని, ఆమెపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని, గేట్స్ దంపతులకు ఆమె పార్ట్‌టైమ్ చైనీస్ ట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తుందని, అయితే వాంగ్ అందంగా ఉండడం వల్లే కొందరు ఇలా ఆమెపై పుకార్లు పుట్టించి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.