ఆ ఎన్నికల్లో ఓటమే ఈ నేతలకు కలిసోచ్చిందా..?

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళారు. 2018, డిసెంబర్ లో జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అయితే జానారెడ్డి, కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇలా చాలా మంది నాయకులు ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమిపాలవడం పలువురు నేతలకు ఇపుడు కలిసోచ్చింది. అందులో ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, రేవంత్ రెడ్డిలు ఉన్నారు.

బీజేపీ నేత కిషన్ రెడ్డి 2004, 2009, 2014లో వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2018లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఓటమి తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత మోదీ కేబినెట్‌లో హోంశాఖ సహాయ మంత్రిగా చోటు దక్కించుకొని ప్రస్తుతం కేబినెట్‌ మంత్రి స్థాయికి ఎదిగారు. కిషన్ రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా గెలుస్తే ఈ స్థాయికి చేరుకునే వారో కాదో..!

మరో బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ కూడా 2018లో కరీంనగర్ ఆసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్ళీ కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ దక్కించుకొని.. టీఆర్ఎస్ నేత, సిట్టింగ్ ఎంపీ వినోద్ కుమార్ పై విజయం సాధించి తొలిసారి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. ఎంపీగా ఎన్నికైన కొన్ని రోజులకే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టి దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించడంతో పాటు… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టారు. తాజాగా హుజురాబాద్ ఉపఎన్నికపై బండి సంజయ్ కన్నేశారు.

తెలంగాణలో టీడీపీకి ప్రాధాన్యత తగ్గుతున్న క్రమంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేత రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా పార్టీలో చేరిన మూడేళ్ళకే పీసీసీ పగ్గాలు అందుకొని సీనియర్లకు షాక్ ఇచ్చారు. కాగా రేవంత్ రెడ్డి 2018లో కొడంగల్ ఆసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ స్థానం అయిన మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకొని ఎంపీగా గెలుపొందారు. పార్టీ సీనియర్ నేతలను దాటుకొని టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అందుకున్నారు. అయితే రేవంత్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తుండగా… రాష్ట్రంలో గాడి తప్పున్న కాంగ్రెస్ ను రేవంత్ ఎలా అదుపులో పెడుతారనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news