గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. పేరుకు వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలయిన పరిధి మాత్రం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. అధికార టీఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ కోసం ఆశవహుల సందడి ఓ రేంజ్ లో మొదలైంది. పార్టీ నుంచి కార్పొరేటర్లుగా పోటీ చేసేవారి సంఖ్య చూసి బేజారెత్తిపోతున్నారు స్థానిక ఎమ్మెల్యేలు..ఒక్కో డివిజన్ నుంచి వందల మంది పోటీకి సై అంటుండటంతో ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అయినా.. పరిధి మాత్రం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది. మొత్తం 66 డివిజన్లు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వరంగల్ ఈస్ట్ 24, వరంగల్ వెస్ట్ 26, వర్ధన్నపేట 12, పరకాల 3, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఒక డివిజన్ ఉన్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇవ్వాలన్నది టీఆర్‌ఎస్ ఆలోచన. కానీ.. టికెట్ ఆశిస్తున్నవారంతా గెలుపు గుర్రాలమే అని చెబుతున్నారట. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై ఓ రేంజ్‌లో ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఎవరు చెబితే వింటారో తెలుసుకుని వారితో ఫోన్లు కూడా చేయిస్తున్నారట కొందరు ఆశావహులు. తాజా మాజీ కార్పొరేటర్లు సైతం మరోసారి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మరికొందరైతే పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్రంగా బరిలో దిగేందుకు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారట.
రిజర్వేషన్లు తారుమారు కావడంతో..మాజీ కార్పొరేటర్లు కొందరు తమను తొక్కేయడానికే ఎమ్మెల్యేలు అలా చేశారని గుర్రుగా ఉన్నారు. డివిజన్లలో తమకే గెలుపు అవకాశాలు ఉన్నాయని..సర్వేలు కూడా అదే చెబుతున్నాయని కొందరు సర్వే రిపోర్టులను నేతల ముందు పెడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో మీ గెలుపుకోసం పనిచేశాం. డబ్బులు కూడా ఖర్చుపెట్టాం. ఇప్పుడు టికెట్ ఇవ్వరా అని కొందరు నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు. అభ్యర్థులు ఎప్పుడో ఖరారైనా.. కేవలం మభ్య పెట్టడానికే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు కొందరు అనుమానిస్తున్నారు.
టికెట్ రాదని భావించిన వాళ్లు హైదరాబాద్‌లో తమకు పరిచయం ఉన్న నేతల ద్వారా పార్టీ పెద్దలకు చెప్పిస్తున్నారట. ఇలాంటి సిఫారసులు.. పలకరింపుల ఫోన్లు గ్రేటర్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారాయట. డివిజన్లలో ఆర్థిక, అంగబలం ఉన్న లోకల్ లీడర్ల గురించి పార్టీ పెద్దలు అన్వేషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ స్థాయి పోటీ ఉండటంతో టికెట్ దక్కని వారు క్షేత్రస్థాయిలో రెబల్స్‌గా మారి పనిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన సైతం అధికారపార్టీ ఎమ్మెల్యేలను వేధిస్తుందట.