తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. మోహినీ అవతారంలో స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు అన్నారు.
క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను మాయచేసి, సురులకు అమృతం పంచినట్లు పురాణ గాథ. ప్రపంచమంతా మాయా విలాసమని.. తన భక్తులు కానివారు మాయాధీనులు కాకతప్పదని స్వామివారు బోధించారు. మాయా జగత్తు నుంచి భక్తులను బయటపడేయటమే మోహినీ రూపం పరమార్థం. ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్నారు.
తిరుమల బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. స్వామి సేవకు వస్తున్న వారికోసం టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు.