పల్లెల్లో సంక్రాంతి వేడుకలు కన్నుల పండుగగా ఉంటుంది. చుట్టూ వాతావరణంలో కొత్త అందాలను పూసుకుంటుంది. కొత్త దుస్తుల్లో, ఇంటి అల్లుళ్ళతో సరదాగా సంబురాలు జరుపుకుంటారు. హరిదాసులు, బుడబుక్కలు, జంగమ దేవర, పిట్టల దొర, గురు శిష్యుల సంవాదం, కొమ్మ దాసరి, గొల్ల బోయుడు ఇలా అందరూ సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో తిరుగుతూ, ప్రజలను అలరించి, జానపద, పౌరాణిక గాథలు చెబుతూ, కానుకలు తీసుకుని, గృహస్థులను ఆశీర్వదిస్తారు. మరి అలాంటి వాతావరణాన్ని నగరవాసులకివ్వాలనే ఉద్దేశ్యమే శిల్పారామంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల ముఖ్య ఉద్దేశ్యం. హైదరాబాద్‌లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హైటెక్ సిటీలోని శిల్పారామానికి జనాలు క్యూ కడుతున్నారు.
శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పల్లె వాతావరణంతో అక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. పండగ ప్రత్యేకతలు పిల్లలకు తెలిసేలా కార్యక్రమాలు రూపొందించారు. వీటిని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు. దీంతో శిల్పారామానికి వచ్చే రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. శిల్పారామానికి వచ్చి వెళ్లే రూట్లలో కిలో మీటరు కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.