సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కులం బలాన్నే నమ్ముకుందా ?

-

ఎంఎల్సీ సి ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ సాగర్ ఉప ఎన్నికలోను అదే స్పీడుతో ముందుకెళ్తుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎంఎల్సీ ఫలితాలు టీఆర్ఎస్‌ కు చాలా బూస్టింగ్ ఇచ్చాయి అయినప్పటికీ, సాగర్ ఎన్నికలో గెలువడం ఆ పార్టీకి ఎంతో అవసరం అనే చెప్పాలి. తాజాగా జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఉపయోగించిన కులాల అస్ర్తాన్నిఇక్కడ ప్రయోగించాలని చూస్తుంది అధికారపార్టీ. కులం పరంగానే సీటు ఇవ్వడమే కాదు. కులాల ఓట్లకు గాలం వేయడం కోసం ప్రత్యేక వ్యూహాన్ని సిద్దం చేసింది.

రాష్ర్టంలో బిజెపి కి పట్టు లేదని ఎంఎల్సీ ఎన్నికలతో అధికార టిఆర్ ఎస్ నిరూపించగలిగింది. సాగర్ లో కూడ అదే రిపీట్‌ చేయాలని టిఆర్ఎస్ భావిస్తోంది. దీనికోసం అనుసరిస్తున్న వ్యూహమే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంఎల్సీ ఎన్నికల్లో ఆయా కులాల నేతలకు నాయకత్వం అప్పగించిన టిఆర్ఎస్ లో విందు భోజనాలతో సక్సెస్ చేయించారు. మీకు అండగా మేం ఉన్నాం, మీరు మాకు అండగా ఉండండి అంటూ కుల నేతలు, మంత్రులు సైతం కుల నాయకులుగా అవతారం ఎత్తి మరి ప్రచారం చేశారు.

ఇప్పుడు సాగర్ ఉప ఎన్నికలో కూడ అదే ఫార్ములా ను టిఆర్ఎస్ నేతలు అనుసరిస్తున్నారట. కులాల వారీగా మంత్రులను, ఎంఎల్ఎ లను రంగ ప్రవేశం చేయించారు. ముగ్గురు మంత్రులను సాగర్‌లో రంగ ప్రవేశం చేశారు. మండలానికి ఇద్దరు ఎంఎల్ఎ లు ఉంటే.. అందులో ఒక ఎమ్మెల్యే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు. మరో ఎమ్మెల్యే ఆ మండలంలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఎంఎల్ఎ కు ఇన్ చార్జిగా ఇచ్చారు. ఎస్టిలు ఎక్కువగా ఉన్న త్రిపురారం, తిరుమలగిరి మండలాలకు ఎస్టి వర్గాలకు చెందిన వారిని ఇన్ చార్జిగా నియమించడం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదే అని తెలుస్తుంది.

నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండడంతో ఆ వర్గం వారిని కూడ అధికంగా రంగంలోకి దించారు. ప్రతి మండలంలో సామాజిక వర్గంలో బలమైన వారితో కలిసి, ఓట్లుగా మార్చుకునేలా చర్చలు సాగిస్తున్నారట. మన కులం నేతగా నేను ఉన్నాను.. నాకు పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. మీకు అండగా నేను ఉంటానని ఆయా కులాల వారికి నేతలు చెబుతున్నారంట. దీంతో ఇప్పుడు ఎమ్మెల్యేలంతా వివిధ కులాల నేతలుగానే నాగార్జున సాగర్ లో మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ కూడ అనుసరించే ప్రయత్నంలో ఉందట. కాంగ్రెస్ కూడ కులాల వారిగా సమావేశాలను చేయనుందట. దీంతో సాగర్ ఎన్నిక చివరికి కులాల మధ్య ఈక్వేషన్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news