ఏంటో ఉపఎన్నిక వస్తేనే అభివృద్ధి చేయాలి…లేదంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ వైఖరి ఉంది. ఇంతకాలం నియోజకవర్గాల అభివృద్ధి గురించి పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్..ఉపఎన్నికలు వస్తే చాలు…ఆ నియోజకవర్గానికి నిధుల వరద పారిస్తుంది. ఉపఎన్నికలో గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెడుతుంది. ఇప్పటివరకు ఉపఎన్నికల్లో ఇదే ఫార్ములాతో పనిచేసింది.
కానీ అదే ఫార్ములాతో మునుగోడులో రాజకీయం చేయడానికి టీఆర్ఎస్ రెడీ అవుతుంది. అసలు కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయకముందే…మునుగోడు అభివృద్ధికి నిధులు కేటాయించడం మొదలుపెట్టింది. ఇప్పుడు రాజీనామా చేయడంతో ఉపఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ మళ్ళీ నిధులు అందించడం మొదలుపెట్టింది. అయితే గతంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలవడానికి కేసీఆర్ పలు హామీలు ఇచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు, ప్రతి మండల కేంద్రానికి రూ.30 లక్షల అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. హామీ ప్రకారం…జిల్లాలోని మిగతా నియోజకవర్గాలకు నిధులు వచ్చాయి గాని…కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉన్న మునుగోడుకు నిధులు రాలేదు.